అద్భుతమైన కథ శివ భక్తి అంటే ఇలా ఉంటుంది.... అమోఘమైన నాయనారు శివ భక్తి

 అద్భుతమైన కథ శివ భక్తి అంటే ఇలా ఉంటుంది....


 నయనార్లు  గొప్ప శివ భక్తులు అని చెప్పొచ్చు...
భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి....

కార్తీకమాసం సందర్భంగా వారి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం రండి..

 గుగ్గులు కలశ నాయనారు ::

చోళదేశమున తిరుక్కడవూరులో గుగ్గులు కలశ నాయనారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

అక్కడ ఈశ్వరుని పేరు అమృతఘటేశ్వరుడు అని పిలిచేవారు. మార్కండేయుడు ఈ లింగము వద్దనే తపస్సుచేసి, తన 16వ ఏట అమరుడైయ్యాడు.

గుగ్గులు కలశ నాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిరోజు గుగ్గిలముతో ధూపము వేయుచు పూజ చేసేవాడు. ఈ విధంగా అతనికి గుగ్గులు కలశ నాయనారు అను పేరు వచ్చింది. 

గుగ్గిలముతో శివునికి ధూపమును సమర్పించుట
 గొప్ప సేవగా భావించాడు.
 అందువలన, చేతిలో ఒక చిన్నకుంపటి, అగ్ని, గుగ్గిలము పుచ్చుకొని నిరంతరము శివునికి గుగ్గిలము ధూపము వేయుచు అర్చిస్తూ కాలం గడిపేవాడు.

ఈ భక్తుని సేవా విశేషము, అతని శివార్చన తపన పరమశివుని పరవశింప జేశాయి. అతని పరమ భక్తి విశేషాలు ప్రపంచానికి చూప నిశ్చయించాడు ఆ పరమాత్ముడు..

శివుని సంకల్పమున, నాయనారు కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది.. కుటుంబము పస్తుంటున్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మాత్రం మానలేదు.

 ఒక రోజున ఆయన భార్య భర్త పిల్లలు ఆకలితో నకనకలాడం చూడలేక  మెడలో  పుస్తెలకు బదులుగా పసుపు కొమ్ము ఉంచుకొని, తన బంగారు మాంగల్యమును భర్తకు తీసి యిచ్చి దీనిని అమ్మి, ధాన్యము తీసికొని రండి" అని భర్త కు విన్నవించుకుంది.

అతడు అది పుచ్చుకొని అంగడికి బయలు దేరాడు. బజారునకు పోవుచుండగా ఒక వర్తకుడు గుగ్గిలము మూటలను భుజముల మీద నుంచుకొని విక్రయించుటకు ఎదురు వచ్చుచుండుట చూచి, నాయనారు 
"ధాన్యము కొనుటకంటే దేవుని సేవకు లేదా పూజకు ఉపయోగపడు గుగ్గిలము కొనుట చాలా మంచిది" అని, 
మంగళసూత్రమును అతనికిచ్చి, వర్తకునినుండి గుగ్గిలము మూటలను కొని, వాటిని ఆలయమునకు తీసికొని వెళ్లి, యథారీతిన గుగ్గిలము ధూపముతో తపోమగ్నుడయ్యాడు. 
 
క్షుద్భాధ తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలు అలసి పడుకున్నారు. ఝాము రాత్రి గడచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు నాయనారు భార్య దైవమును ప్రార్థింప సాగింది.

అమె ప్రార్థనకు, నాయనారు భగవత్‌ సేవ నిష్ఠకు, వారి మంచితనము, పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతోషపడ్డాడు.
వారికి సకల సంపదలు అనుగ్రహించాడు..  ఆమె పరవశంతో పరమేశ్వరుని స్థుతించింది...

నాయనారు  ఇంటికి రాగానే చాలా ఆశ్చర్యపడ్డాడు... "ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది?" అని భార్యనడిగాడు. అమె జరిగినదంతా చెప్పింది.

 అంతటి శివానుగ్రహమునకు, అక్కడకు చేరిన శివభక్తులతో కలిసి పరమశివుని కీర్తించాడు... 

నాయనారు ఈ సంపదను తనదిగా భావించలేక పోయాడు. "ఇదంతా శివునిది - దీనిని శివభక్తులకే వినియోగించాలి" అని అంటూ అతని నిరంతర సేవ కొనసాగించాడు.

ఒక రోజున నాయనారు తిరుప్పనందాళ్ దేవాలయము సందర్శించుకుందామనుకున్నాడు. 
అరుణ సతీశుని దేవాలయము అక్కడ వున్నది. ఇక్కడ శివలింగం ఒక పక్కకి ఒరిగి ఉంటుంది...

చాలామంది ఆ లింగమును సరిచేయ ప్రయత్నించారు. కానీ వీలుకాలేదు. రాజుగారు ఆ వంపుకు మేకులు తాళ్ళు కట్టించి, ఏనుగులతో లాగించారు..
 అయినా ఏమాత్రం ప్రయోజనము కలుగలేదు. 
రాజుగారికి ఇక ఏమి చేయాలో అర్థం కావట్లేదు.

ఈ సంగతి గుగ్గులు కలశ నాయనారుకు తెలిసింది. అచ్చటికి వెళ్ళి, "నేనుకూడా కొంచెము ప్రయత్నించెదను" అని, ఆ శివలింగము వంపును తాడుతో బిగించి,
 ఆ తాడు కొసను తన మెడకు కట్టుకుని, శివధ్యానము చేస్తూ లాగాడు.
 అలా చేసిన తోడనే, లింగము వంపు సరి అయ్యి యధాస్థితికి వచ్చింది. 
 దేవతలు పుష్పవృష్టి  అంటే పూల వాన కురిపించారు.

నాయనారు భక్తి ప్రపత్తులు ఊరు వాడా.. అంతా వెల్లడయ్యాయి.
జీవించియున్నంత కాలము శివసేవలో గడిపి, అంత్యమున శివ సాయుజ్యమును పొందినాడు.

ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ...

హర హర మహాదేవ ...  శంభో శంకర.....

లైక్ చేసిన ఫ్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చేయండి ఫాలో అవ్వండి.. ధన్యవాదాలు

Post a Comment

0 Comments